వ్యధాప్రవాహం..


నీకు సరిహద్దులంటూ ఏమీ లేవుగా
ప్రవహించు కన్నీరా ప్రవహిస్తూనే ఉండు
హృదయ వ్యధలన్నీ తీరేలా ప్రవహించు


నీవు కంట జారితే వేదనలు కరిగేను
నీకు నేనేం గిరిగీయలేదుగా పొంగుతూ 
సగం ప్రవహించి ఆగే నదిలా కాక 
సాగరంలా ఉప్పొంగి రోధించు...


కనుల భాషను కన్నీటి రూపంలో చెప్పి
వేదన తీరి మది భారం తీరేలా రోధించు
లోపల బడబాగ్నిని ఎవ్వరూ చూడలేరు
కనురెప్పల కదలికతో నువ్వు కాంచి చల్లార్చు!

నన్ను మరువకు

మధుర జ్ఞాపకాలనే హృదయ పల్లకీలో ఊరేగించి
మనసంతా నిన్నే నింపుకున్న నన్ను మరువకు!

కొంత కాలానికి నీవు వేరొకరి గుండెలో కొలువైనా
నా గుండె సవ్వడై కొట్టుకుంటావు ఇది మరువకు!

ప్రకృతి అందాల పూలపానుపుపై నీవు పవళించినా
పరిమళమంతా నాశ్వాసలో దాగుంటుంది మరువకు!

యవ్వనం జోరులో పరువపు మత్తులో బంధీవైనా
విషాదపు ఎండలో నీ భాస్వామినౌతాను మరువకు!

పరిస్థితులు తారుమారై గతులుమారి మనం వేరైనా
కంట్లో ఉన్న నీ ప్రతిరూపాన్ని ప్రేమిస్తాను మరువకు! 

నీవులేక..

అసలేం అర్థం కాదు అంతూ చిక్కదు
నీకు నాకున్న బంధమేమో తెలియదు
నాతో నీవుంటే నిండుపున్నమి జీవితం
నీవు దూరమైతే ఊపిరి నిండా శూన్యం!

క్షణాలన్నీ శత్రువులై పగబట్టెనని తెలీదు
మది మెదడు కలుషితమైనా కానరాలేదు
నీవులేక చెప్పుకున్న ఊసులే చిన్నబోయె
చెప్పాలనుకున్న మాటలేమో మూగబోయె!

గమ్యం దారిలో గల్లంతై అడుగు పడ్డంలేదు
నీడ కూడా వదిలేసె అందుకే వెలుగులేదు
నిర్మానుష్యం జీవితంపై పెత్తనం చెలాయించి
నాకునే అపరిచితురాలినైతి నీకై ఆలోచించి!

ఎడబాటుతో వేదనింత దగ్గరౌతుందనుకోలేదు
గుండెమంట చల్లారే మార్గం తెలియడంలేదు
నాతో నీవు లేక మరణం నన్ను తాకనంది
జీవించడం చేతకాని బ్రతుకు నరకంలాగుంది!

వృక్షవేదన..

మట్టితల్లి ఎదను చీల్చుకుని మొలకగా నేను పురుడు పోసుకుని మనుషులందరికీ ఎంతో సేవ చేసుకుని మహావృక్షమై ఎదగాలని ఆశపడితినో లేక నేను అందమైన కలనే కంటినో తెలియక పోయె నా ఈ గుండెఘోషను తీర్చు మానవజాతే లోకంలో కొరవడిపోయె! మమకారం మరచి అవసరానికి అన్నింటా వాడుకుని నన్ను పీకేసినా అమ్మలా మిమ్మల్ని చూసుకుంటూ ఆకలి వేసిన నాడు ఆహారమైనా సేదతీరేవేళ మంచమై, చేతకాని నాడు చేతికర్రగా మారి ఊతమిచ్చాను పాడుగాలిని కడుపులో నింపుకుని ప్రాణవాయువు మీకు ఇస్తున్నాను! మలినం లేనట్టి మనసుతో పచ్చగా ఎదిగి అందరి ఇచ్ఛా కావాలని బ్రతుకంతా మనిషితోటే పయనమై చితిదాకా మీతో కలిసుండాలని కంకణం కట్టుకున్న నాపైనే కక్షగట్టి నరుకుతుంటే కట్టెనై కాలుతున్నా భగవంతుడే కలిపిన బంధములే ఇదని సర్దుకుని గాలినై వీస్తున్నా! మతలబులతో ముడిపడ్డ మనిషి నాకు పుట్టెడు కష్టాలు కలిగించినా ఓర్పుతో అన్నీ సహించి అక్కున చేర్చుకుని మీకు నీడను ఇచ్చినా వేరులో దాచిన ఔషధాన్ని ఇస్తి, నా కొమ్మని నీకు ఆయుధంగా చేస్తి ఇన్ని చేసిన నన్ను మీరు చంపుతుంటే నేలరాలుతూ లోలోన రోధిస్తి! మంత్రం ఏదో జరిగిపోయి మాయతో రెండు చేతులు నాకు మొలిస్తే నా ఒంటిపై నీ చేయి పడనీయక వృక్షమై నీకు భిక్ష అయ్యేటి దాన్ని మానవా.....మనసు ఉన్న మనిషివి కదరా నీవు ఇకనైనా మారవా అంకురార్పణ మొదలు అణువణువూ నీకే అర్పితమని తెలుసుకొనరా!

నీ బలాత్కారం

రెండు తొడలు మధ్యలోంచి తన్నుకునొచ్చి
ఆకలని ఏడుస్తూ రొమ్ములు రెండూ పీల్చి
కడుపునిండితే నువ్వు బోసినవ్వులు రువ్వి
జన్మతః స్వార్థంతో పెరిగి పెద్దదైన నీ ఒళ్ళు
ఆడదానిపై ఆధారపడ్డ పరాన్నజీవివి నువ్వు!

పెరిగినాక మీసాలు గెడ్దాలు నీకు పుట్టుకొచ్చి
అవయవాలు ఎదిగి ఆకలి ఆకారాలు మార్చి
ఆడది కనపడితే ఆత్రుతతో పెరుగు నీ కొవ్వు
కనపడని అందాలకై వెతుకుతాయి నీ కళ్ళు
జన్మస్థలమైన అంగానికై ఆరాటపడేవు నువ్వు!

ఆ ఆరాటంలో మగబుధ్ధి వక్రించి కోరిక పైకొచ్చి
నెరవేర్చుకునే నెపానికి భీభత్స మార్గాలు కూర్చి
కుదిరితే వశపరుచుకుని లేకుంటే బలాత్కరించి
ఆమె కట్టూబొట్టూ రెచ్చగొట్టెనను నీలోని కుళ్ళు
నిగ్రహం కొరవడి పైత్యంతో కొట్టుకున్నది నువ్వు!


చెప్పాలంటే శారీరకంగా రేప్ చేయబడ్డ ఆమె/అమ్మ
కుచితవైఖరితో మొత్తం బలాత్కరించబడ్డది నువ్వు!  

ఏకమైనాము..

పలుకరించే పదిమందిలో నేనూ ఒకదాన్నై పలుకరిస్తే
పస ఉండదని పరిపరివిధముల యోచించి ప్రియా అన
ఉదయభానుని తొలికిరణంలా నిన్ను నేను చుట్టేసానని

వేల నక్షత్రాలు నిశిరాత్రి నందు నీ పక్కన చేరి నిదురిస్తే
ఈర్ష్య పడిన నా వయసు పిల్లగాలిలా వీచి నిన్ను తాక
నీ మనసంతా కోటికాంతుల వెన్నెలవెలుగు నింపేసానని

ఎన్నెన్నో వర్ణాలు ఏవేవో భావాలను కుంచెగా మార్చి గీస్తే
ఆగనన్న ప్రతి భావంలో నేనే వివిధ భంగిమల్లో అగుపించ    
వరించిన వలపు వశం తప్పి అతిసౌందర్య రూపం నాదని

సమస్యల సాగరాన్న నిన్ను ఆటుపోట్ల అలలు ఆవహిస్తే
గాబరాపడ్డ నా మనసు నిన్ను చేరి నేను తోడున్నానన
నీ జీవితపు నావను తీరానికి చేర్చే తెరచాపను నేనేనని

నీ సర్వస్వం నేనని చెప్పలేని నీ నిస్సహాయతని ప్రేమిస్తే
నువ్వు నాకు గులామువై చేయకు సలామని నేను అన
నా ప్రతిబింబమై నన్నంటి నాలోన నిన్ను ఐక్యం చేసావు!

సెగ సలపరం

వయ్యారి నడుస్తుంటే వెనుక వెనుకే వెళ్ళి 
దాచిన దాగని వంపులకు దాసోహమయ్యి
వలపేదో పుట్టి ఒళ్ళంతా జివ్వుమన్నదని
తను తాకకనే సొగసు సెగలు రేపిందంటూ
నింద తనపై మోపి భుజం తడుముకోనేల!

కోమలి తలెత్తక తన దారిన తానెళుతుంటే
పొంగిన పసిడిపరువం పైటజార్చ పరవశించి
కన్నె ఎదపై కన్నేసి కానరాని చోట కాలగా    
చివరికి చిన్నదాని చేతికి చేపపిల్లవోలె చిక్కి
వాలుకళ్ళతో వలవేసి పట్టెనని వెటకారమేల!

సొగసరితో సావాసమని సోగ్గాడిలా ముస్తాబై
పెదాలపై నవ్వు చూసి నరాలు సయ్యిమన 
కొత్తగా శృంగారం అదుపు తప్పి గింజుకుంటే
నీలోని వేడి బండారమంతా బయటపెట్టునని  
గోటిముద్రలు తాను కోరెనని అబాసుపాలేల!

రాలిన మనసు


మనసులోనే భావాల్ని దాచి బయట పెట్టకుండా
సహించినంత కాలం నేను సంస్కారవంతురాలినే!

పండిన ఆకులే రాలిపోయే ఆకులురాల్చే కాలంలో

కన్నీరు కార్చబోవ ఋతువు మాత్రం కరువాయెనే!

మరణించిన మనసు వెతకబోవ సాక్ష్యం దొరికెనని

భావాలని బంధించి వధించాలని ఎత్తులెన్నో వేసెనే!

శ్వాస ఆగిపోవడమే మరణమంటే ఎలాగని ప్రశ్నించ

అస్వస్తతకు గురైన శూన్యహృదమే తల్లడిల్లిపోయెనే!

తనువంతా పసిడితో అలంకరించి పయనమవబోవ

పెదవులపై నవ్వు విరిసి మనసు ముక్కలై రాలెనే!

స్థిరతిమిరం..

నీ అస్థిర చంచల మనసుతో తూకమేయకు నా ప్రేమను
కవాటాలే కంపించి హృదయమే కదలాడేను గారాభంతో
అంచనాలు వేసి అధికమించి దాటేయకు అనురాగకొలను
నీ అణువణువూ కరిగేను నా అనంత ప్రేమ సామ్రాజ్యంలో
వలపువలకి చిక్కిన మనసుకి వినిపించకు అలజడులను
మూగవైన భావాలు ఆగలేనని గొంతెత్తి పాడేను ఆవేశంతో
నీ స్వప్న జగత్తుకి రంగులు అద్దమనకు నా ఆశయాలను
సరిపెట్టుకోలేనంటూ విలవిలలాడేను వివరించలేక తనలో
అదే అలుసుగా గెలుపు నీది అనుకుని శాసించకు నన్ను
నీ అందలానికి నేను సోపానం కానని చింతించకు వేదనతో
తిమిరాల ప్రమిదనని తీర్పు చెప్పి నిందించకు నా ప్రేమను
సౌఖ్యాలు సమిధలైనా అణగారిపోయే కోర్కెలేం కోరుకోను...