మోసం..

పరాయి వారిపై పిర్యాదు ఏం చేసేది
మన అనుకున్నవారే మనల్ని మోసగిస్తే
తెలిసిన ముఖమే ముఖాన్ని చాటేస్తే..

ఈ బేలకంటి కలల్ని ఎవరికి చూపేది
కళ్ళు తెరచి చూడగా కలలే మాయచేస్తే
పరిచయాలే పరాయివైపోయి పయనిస్తే..

వెలసిన నమ్మకానికి ఏరంగు పూసేది
రంగరించిన రంగులన్నీ ఆహ్లాదాన్ని విరిస్తే
మనసున దాగిన మనసుని ముక్కలుచేస్తే..

క్షణానికి ఒక మార్పుని ఎలా నమ్మేది
అనిశ్చల ఆత్రుతని నిలకడ బంధం అనేస్తే
నీతిని నిలబెట్టి నిలువుదోపిడీ చేసి ప్రశ్నిస్తే..

పాటించని ప్రవచనాలు ఎవరికి చెప్పేది
పాపం పుణ్యమని వచ్చిన వారిని గెంటేస్తే
మోసం చేత మరల మోసపోయి విచారిస్తే..      

నాలో నాతో..

శూన్యం కళ్ళలో నాట్యమాడుతుంటే
మనసు తనువు రెండూ నలుగుతుంటే
మానస కాల్పనిక ఊహా నేస్తమా..
ఒంటరి జీవితానికప్పుడు నీవే ఆసరాకా!


స్వచ్ఛంద పరమార్థమే తెలుసుకోక
స్వార్థాన్ని అవసానపట్టి సాధన చేయక 
సతమతం అవుతుంటే మేల్కొల్పి..
నా భుజస్కంధాలకు ఊతమే నీవుకా!


సత్కార్య సంకల్పమే చేయ నెంచితే 
నా మనోవికాస విశ్వాసమే సడలిపోతే
నన్నంటి ఉండి లోకంపోకడ తెలిపి..
కనులవెలుగై నడిపించి నాలో ఏకంకా! 

ప్రణయ ప్రకృతి

మేఘాలతో మెరుపులే ఊసులాడెనేమో 
చినుకులే ధారగా కురిసి చిందులేసెనే..

వలపు వాయిద్యాలై రాగాలు ఆలపించగా 

పులకరింతలే పురివిప్పి నాట్యమాడెనే..

మచ్చటించిన మాటలతో ఎదకొలనే తడవ

ఎత్తు నుండి పల్లానికి పరవశం పారెనే..  

మురిసే నీటిముత్యాలే మోముకి సొగసులద్ద

అలలై ఎగసే ఆనందం పెదవులపై తేలెనే..

ప్రసరించే కిరణపు కాంతిలో కళ్ళు మెరవ 

మైమరచి తనువే ఇంద్రధనస్సుగా వంగెనే..

ప్రకృతల్లిన పచ్చని పందిట్లో ప్రేమకు పెళ్ళవగా

నేల మట్టివాసనలతో కమ్మని విందు చేసెనే..

ఊరటించిన కొమ్మరెమ్మలు కోటిదీవెనలు ఇచ్చి

పువ్వులనే అక్షింతలుగా చల్లుతూ దీవించెనే..

ఆ రూపం..

నిత్యం తలపులతో మ్రోగేటి గుండె లయలు
తన్మయ నర్తనతో ప్రతిధ్వనించు మువ్వలు..
  
ఊహలు తుమ్మెదలై వదనాన్ని ముద్దాడగా 
చిరునవ్వు అధరాల తేనె జుర్రుకోక ఆగునా..

హృదయంలో వలపు ఉచ్ఛ్వాసై ఊపిరి పోయ 
మరో మదిలో సుగంధభరిత నిచ్ఛ్వాస ఛాయ.. 

సరసాలతో ఆలింగనమైన ప్రణయ సామ్రాజ్యం 
విడిపోని సుందర సుమధుర సువిశాల జగం..   

ప్రేమని కనురెప్పల్లో దాచుకున్న కలువపువ్వు 
వెన్నెలై లేని కోరికల్ని రెచ్చగొడుతుందా నవ్వు..

నవరసాలు ఉన్న అమాయక ముఖకవళికలు
ప్రతిజన్మ నీవేనని చేసుకుంటున్న ప్రమాణాలు..   

నేరం..

వాహ్ వా...ఎంత అందమైన ఆత్మవంచన
కవితలని పద్యాలని పదాలు పేర్చి రాయడం
శవమై తనని తానే భుజాలపై మోసుకోవడం
అద్దాలంటి అక్షరాల్ని అమ్ముకోవాలన్న ఆశతో 
అందరూ అంధులున్న నగరంలో తిరగడం!!

పాడెకమ్మీల కర్రను వేణువుగా మలచి మీటి
శ్రావ్యమైన రాగాన్ని వినిపించాలి అనుకోవడం 
నిరాశ నిట్టూర్పులతో స్మశానమంతా నిండగా
చచ్చిన ఆశలకు ఊపిరి పోయ పూనుకోవడం 
వేదనలు పురివిప్పి నాట్యం చేస్తూ నవ్వుకోగా  
ఆనందకేళీ విలాసమే అదంటూ మురిసిపోవడం 
అంచనాల అంకురాలన్నీ చెదలుపట్టి కూలిపోగా  
అందమైన ఆలోచనలే ఆరోగ్యకరమని అల్లుకోడం 
గాయాలు సరసమని సలపరాన్ని మరీ పెంచగా    
కన్నీరు రానీయకంటూ నవ్వులో దాచుకోవడం!!
భావాల గొంతుపిసిగి ఆత్మహత్య చేసినంత పాపం   

మాతృ శోకం..

నా భారతమాత రోజూ రోధిస్తూనే ఉంటుంది
సాత్వి సీతమ్మ రోజూ అంగట్లో అమ్ముడౌతూ
కుంతీ మాత మాతృత్వం మనోవేదనపడుతూ
రాధ భక్తి భాగవతాన్ని బేరీజు వేసి నవ్వుతూ
మనుషుల మానవత్వం మంటగలిస్తే చూస్తూ..

నా దేశం శిరస్సు దినదినం వాల్చేస్తూ ఉంది
యువత నిస్తేజమై విదేశాలకు వలస వెళుతూ
నీరుగారిన నిరుద్యోగులు సోమరులై తిరుగుతూ
అవిటిదైన పేదరికం దాహం తీర్చని కుంటుతూ
అగుపడ దిక్కుతోచని అభివృధ్ధి నింగిని చూస్తూ..

నా మాతృభూమి తనలోని మనల్ని ప్రశ్నిస్తుంది
మనం కలగన్న స్వాతంత్ర్యం ఇదా అనడుగుతూ
భగత్ సింగ్ ఇది కోరెనా ఉరితాడుకి వేలాడుతూ
సుభాష్ చంద్రబోస్ చెప్పెనా ఎటో మాయమౌతూ
లేక బాపూజీ నేర్పెనా హేరామని ప్రాణం విడుస్తూ..

మిగిలింది!


ఆకాశ మేఘాన్ని తాకి ప్రేమజల్లుగా కురవక
ప్రకృతితో కూడి  పిడుగువై గుండెల్ని పిండగా
నీ ఉనికి పిడిబాకై నాలో ఉప్పెనగా పెల్లుబికె!

వలపు అలగా మారి మనసు తీరం తాకలేక
కోరికల కెరటమై మనసుని కబళించబూనితే
నిన్ను నీవే కోల్పోయి నన్ను కోల్పోయినావె!

ధరణిలా దరి చేరి నాలో నిన్ను దాచుకోలేక
ప్రణయ ప్రకంపనలను పట్టి పిప్పి చేయబోవ
నీవు నలిగి నాకు నేనే శత్రువై సాక్షాత్కరించె!

చీకటి హృదయంలో జ్యోతివలె వెలగడం రాక
ఎగిసిపడే జ్వాలవై హృదయంలో మంటలురేపి
నీవు కాలి నేను కాల మిగిలింది బూడిదాయె!

వచ్చి వెళ్ళిపోకు..

ఇదిగో వచ్చి అంతలోనే వెళ్ళిపోతాను అనకు
వసంతకాలం వచ్చి క్షణాలేగా అవుతున్నాయి  
గాలి పరిమళం మారి మది పులకరించబోయె
ఊపిరి ఉల్లాసమెక్కి మత్తుకళ్ళే అరమోడ్పాయె 
నేనేం చెప్పనైనా లేదు నువ్వేం విననైనాలేదు  
అంతలోనే సద్దుమణగనీయక చల్లగా జారిపోకు!

తారలింకా నీతో ఊసులాడనేలేదు వెళతాననకు
వస్తున్న చంద్రుడేమో నిన్నుచూసి చిన్నబోయి
మన్మధుడ్ని కోప్పడగా ఓరగా రతి నిన్నుగాంచె 
వలపురాగిణులు వయ్యారంగా నిన్ను చుంబించె
నేనది చూసి ఈర్ష్యపడి కౌగిట్లో కట్టిపడేయనేలేదు   
అంతలోనే చలించి మతి మారెనని మాయమవకు!

తీరని దాహం తీర్చక అలజడికి ఆస్కారమివ్వకు
మనసులు రెండూ ముడిపడి పరిభ్రమిస్తున్నాయి
ప్రణయమేను పరిపక్వతతో నాట్యమాడ పురివిప్పె
అదిచూసి నింగి నేలను రమ్మని రాయబారమంపె
రసికత రంగులు ఇంకా పూర్తిగా పులుముకోలేదు     
అంతలోనే అలిగి ఆగలేక వంకలు వెతికి వెళ్ళిపోకు!

అ'సంతృప్తి

నా పయనం మరియు గమ్యం నీవైనప్పుడు
నీవు లేకుండా జీవించమనడం న్యాయమా?

నా ఒంటరితనం నిలదీసి ప్రశ్నిస్తున్నప్పుడు

నీవే సమస్తమని నా అసమర్ధతకి తెలుపనా?

నా అభిరుచుల ఆశలపందిరై నీవున్నప్పుడు

నిన్ను ఆశించరాదని ఆంక్షలు పెడితే ఎలా?

నా తనువూ ఆత్మా నావే అనుకున్నప్పుడు

నాలో నేను లేనేలేనని అంటే అది అబద్ధమా?

నా రక్షణకవచంగా నీ ఉనికి ఉంటున్నప్పుడు

నీ నా శరీరవాంఛలు చేస్తున్నవి పెద్ద నేరమా?

నా తృష్ణకు సంప్రాప్తి మన సంగమమైనప్పుడు

నేను ఇక్కడ నీవక్కడ ఉండడమే జీవితమా?